సిస్టమాటిక్ తియాలజీ 

సిస్టమాటిక్ తియాలజీ

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

ఏదైనా ఒక అంశం గురించి బైబిల్ ఓవరాల్ గా ఏమి చెబుతుంది? అది ప్రస్తుత నా జీవితానికి ఎలా వర్తిస్తుంది? ఈ దృక్కోణంలో అధ్యయనం చేయటాన్నే సిస్టమాటిక్ తియాలజీ అంటారు.

తియాలజీ అంటే దేవుని గురించి అధ్యయనం చేయటం. సిస్టమాటిక్ తియాలజీ అంటే తియాలజీని విభాగాలుగా చేసి ఆయా అంశాలను ఒక క్రమపద్ధతిలో అధ్యయనం చేయటం.

ఉదాహరణకు ‘పాపం’ అనే అంశాన్ని తీసుకుందాం. ఆదికాండం 1 అధ్యాయం దగ్గర నుంచీ ప్రకటన గ్రంథం 22 వ అధ్యాయం వరకు, ఎక్కడెక్కడ ‘పాపం’ గురించిన వివరణ(సమాచారం) ఉందొ వాటన్నిటినీ జాగ్రత్తగా క్రోడీకరించి, ఒక సమగ్ర అవగాహనకు రాగలిగేలా ఒక క్రమానుగతంగా అధ్యయనం చేయటాన్ని సిస్టమాటిక్ స్టడీ అంటాం.  అలా బైబిల్లోని పలు అంశాలను వర్గీకరించి వాటిని ఒక పద్దతిలో, సమతుల్యంగా, హేతుబద్దంగా అధ్యయనం చేయటమే సిస్టమాటిక్ తియాలజీ.

తండ్రియైన దేవుని గురించిన అధ్యయనం –  Theology Proper

కుమారుడైన దేవుడు క్రీస్తు గురించిన అధ్యయనం – Christology

పరిశుద్ధాత్మ దేవుని గురించిన అధ్యయనం – Pneumatology

పాపం గురించిన అధ్యయనం – Hamartiology

రక్షణ గురించిన అధ్యయనం – Soteriology

అంత్యదినాల గురించిన అధ్యయనం – Eschatology

పరిశుద్ధ లేఖనాల గురించిన అధ్యయనం –  Bibliology

సంఘం గురించిన అధ్యయనం – Ecclesiology

దేవదూతల గురించిన అధ్యయనం –  Angelology

దురాత్మల గురించిన అధ్యయనం – Demonology

మనిషి గురించిన అధ్యయనం – Anthropology

సిస్టమాటిక్ తియాలజీ కేవలం జ్ఞానం సంపాదించుకోవటానికి కాదు. ‘వ్యక్తులు దేవుని వాక్యాన్ని తమ జీవితంలోని అన్ని రంగాలకూ అన్వయించుకోవటమే’ ఈ అధ్యయనం అసలు ఉద్దేశ్యమని జాన్ ఫ్రేమ్ అంటాడు.  ఇందులో రెండు విషయాలు స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఒకటి, వాక్యాన్ని జీవితానికి సరైన విధానంలో అన్వయించుకోవాలి. లేనట్లయితే ఆ అధ్యయనం వలన ప్రయోజనం రాదు. రెండు, జీవితంలోని అన్నిరంగాలకూ అన్వయించుకోవాలి. వాక్యం దీనికి వర్తిస్తుంది, దానికి వర్తించదు… లాంటివి చెల్లవు. వాక్యం అన్నిటికీ వర్తిస్తుంది. అందరికీ, అన్ని వేళలా వర్తిస్తుంది. మన జీవితంలో ప్రతి రంగానికీ, ప్రతి సందర్భానికీ, దానిని వర్తింపచేయాలి. అందుకోసమే సిస్టమాటిక్ తియాలజీ.

సత్సిద్ధాంతం లోంచే సత్ప్రవర్తన పుట్టుకొస్తుందని జాన్ స్టాట్ అన్నాడు. మనం ఏమి నమ్ముతున్నామూ అన్నదానికీ, ఎలా జీవిస్తున్నామూ అన్నదానికీ సంబంధం ఉంది. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన సిద్ధాంతాల బట్టే మన జీవితం ఉంటుంది. నువ్వు నేర్చుకున్న బోధ ఎలాంటిదో నీ ప్రవర్తన చెబుతుంది. సత్బోధ నేర్చుకోకుండా సత్ప్రవర్తన కలుగదు.

సత్బోధ ఉంది. దుర్బోధ ఉంది. పరిశీలనగా లేఖనాలు చదివేవారు మాత్రమే దీన్ని వివేచించగలరు. అబద్ద సిద్ధాంతాల్ని ఖండించటం మన బాధ్యత. సత్య సిద్ధాంతాల్ని ముందు తరాలకు తీసుకెళ్లటం కూడా మన బాధ్యతే. కాబట్టి ప్రతి క్రైస్తవునికీ సిస్టమాటిక్ తియాలజీ తప్పని సరి.

‘నాకు సిద్ధాంతాలతో పని లేదండి’ అంటే కుదరదు. ససేమిరా కుదరదు. సత్య సిద్ధాంతానికి మూలం దేవుడే. అబద్ద సిద్ధాంతానికి జనకుడు అపవాది. నువ్వు ఏ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నావో ఎప్పటికప్పుడు పరీక్షించుకునే బాధ్యత నీపైనే ఉంది. ఎలా జీవించినా పర్లేదు అనే వాళ్ళే సిద్ధాంతాన్నీ, తియాలజీనీ నిర్లక్ష్యం చేస్తారు. మౌలిక క్రైస్తవ విశ్వాసాన్ని అధ్యయనం చేయనివాడు, దేని ప్రకారంగా జీవిస్తాడు? క్రైస్తవ పునాది సత్యాల్ని సమగ్రంగా తెలుసుకోకుండా ఏ విధంగా తన ఆత్మీయ జీవితాన్ని సాగిస్తాడు?

తియాలజీ అనివార్యం. నిజంగా దేవుని గురించి తెలుసుకోవాలి అనుకునేవాడు తియాలజీని తిరస్కరించడు. తప్పుడు తియాలజీ ఆత్మీయ వినాశనానికి నడిపిస్తుంది. నిజమైన తియాలజీ నిజమైన భక్తిని పుట్టిస్తుంది. కచ్చితమైన తియాలజీ యదార్ధమైన ఆరాధనకు దారితీస్తుంది.

సిస్టమాటిక్ తియాలజీ చాలా పనులు చేస్తుంది. మన భావజాలాన్ని ప్రశ్నిస్తుంది. మన దృక్కోణాల్ని సరిచేస్తుంది. మన అపోహల్ని బైటపెడుతుంది. మన మనో నేత్రాలు తెరుస్తుంది. మన జీవితపు ప్రతి కోణాన్నీ స్పృశిస్తుంది. వాక్యం పట్ల లోతైన అవగాహన కలుగజేస్తుంది. దేవునితో గాఢమైన సన్నిహిత సంబంధాన్ని కలుగజేస్తుంది. తద్వారా, మరింత నిశ్చయతతో, మరింత లక్ష్యంతో దేవుని పని చేసేలా పురికొల్పుతుంది.

ప్రస్తుత తెలుగు క్రైస్తవ సమాజంలో ‘సిస్టమాటిక్ స్టడీ’ బొత్తిగా లోపించటం వలన సంఘాలు అబద్ద సిద్ధాంతాల పుట్టిల్లుగా మారిపోయాయి. వేదికల మీద బోధకులు వెర్రి బోధలు చేస్తున్నారు. మునుపెన్నడూ లేనంతగా వక్రబోధలు, మూఢ నమ్మకాలు స్థానిక సంఘాల్లో వేళ్ళూనుకుంటున్నాయి. వాక్య నిరక్ష్యరాస్యతలో క్రైస్తవులు మగ్గుతున్నారు. సిస్టమాటిక్ తియాలజీ దీనికి సరైన పరిష్కారం.

సురేష్ వంగూరి, బైబిల్ టీచర్, విజయవాడ.